షార్జీల్‌ ఇమామ్‌పై కేసు.. చార్జిషీట్‌ దాఖలు

న్యూఢిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో జేఎన్‌యూ పూర్వ విద్యార్థి షార్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబరు 15న తన విద్వేషపూరిత వ్యాఖ్యలతో విద్యార్థులను రెచ్చగొట్టినందున ఆయనపై చార్జిషీట్‌ వేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు గళమెత్తడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీకి సమీపంలో ఉన్న న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ, జామియా నగర్‌ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన అల్లరి మూకలు అనంతరం యూనివర్సిటీలో ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’)